Telegram Web
అవన్నీ తాత్కాలికమే!

రాత్రింబగళ్లు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు... కాలచక్రంలో భాగంగా ఇవి వస్తూ, పోతూంటాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవే. కానీ కనబడుతూ, కనుమరుగ వుతూ ఉండటం వల్ల తాత్కాలికమైన వాటిలా అనిపిస్తాయి. తాత్కాలికమైనవైనా, శాశ్వతమైన వాటిలా కనిపించేవి కొన్ని ఉన్నాయి. అవి యవ్వనం, జీవితం, ఐశ్వర్యం, మనసు, నీడ, పాలకుల ప్రేమ. ఈ ఆరూ చంచలమైనవి. అశాశ్వతమైనవి. అయినా శాశ్వతమైన విషయాలన్నంతగా వీటిని గాఢంగా నమ్ముతారు చాలామంది. వీటిని తాత్కాలికమైనవని గుర్తించి, జాగ్రత్తగా మెలగాలన్నది పెద్దలు చెప్పేమాట.

యవ్వనం జీవిత దశల్లో ప్రధానమైంది. కీలకమైన ఘట్టాలను నిర్వర్తించే వయసు. సంపాదించే సత్తా, బలిమి, బింకం వాటికి తోడు కాస్త పొగరు ఉండే ప్రాయం. కాబట్టి తమకు ఎదురు లేదని, యవ్వనమే శాశ్వ తమని భ్రమిస్తారు చాలామంది. జీవి తమూ అంతే. ఎంతో, ఎన్నో, ఏదో, ఎక్కడో... ఉన్నాయనుకుని, వాటిని ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంతో చివరి దశవరకూ పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ రాశిపోసిన బియ్యంలో చెయ్యి పెట్టినవారికి పిడికెడు బియ్యమే దక్కినట్లు వారికి యోగమున్నంత మేరకే దక్కుతాయనే నిజం ఆలస్యంగా, అలసి పోయాక తెలుసుకుంటారు. నిలకడ లేని వాటిలో ఐశ్వర్యం ప్రధానమైంది. అది ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో, ఎలా వంచిస్తుందో, ఎప్పుడు ఎవరి దగ్గరకెలా చేరుతుందో, ఏ క్షణాన ఎవరి దగ్గరనుంచి ఎలా జారుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సంపద ఉందన్న గర్వం కలిగి ఉండటమంత అవివేకం మరొకటి ఉండదు. ఇలాంటివారిని ఉద్దేశించే ఆదిశం కరాచార్యులు 'ధన, జన, యవ్వన బలాలు చూసి గర్వించవద్దు. వీటన్నింటినీ కాలం రెప్పపాటులో దూరం చేస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరు విడిపిం చుకోండి' అంటూ భజగోవిందంలో హెచ్చరించారు. చిత్తం అంటే మనసు. మనిషి మనుగడను మననే నియంత్రిస్తుంది. కానీ దాన్నది నియంత్రించుకోలేదు. ఏ క్షణం ఎటు మారుతుందో చెప్పలేని స్థితి దానిది. అందుకే మనసును నియంత్రించడానికి పతంజలి మహర్షి యోగసూత్రాల్లో సూచించిన సాధనాలేంటంటే- ఏకాగ్రతతో ధ్యానం, భక్తి- వైరాగ్య భావనలు, ఆధ్యాత్మిక చింతన, కోరికలను త్యజించడం, ఇంద్రియ నిగ్రహం.

ఇక, పాలకుల కరుణ. పాలించేవాడికి ఆనందం కలిగినా, ఆగ్రహం కలిగినా ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పాలకులు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే పాలకులకు దూరంగా, పాల కడవకు చేరువగా ఉండటం మంచిదని పెద్దల మాట. సేద తీర్చడం నీడ స్వభావం. కానీ దాన్ని నమ్ముకోవడమంత అవివేకం మరొకటుండదు. వెలుగు మీద ఆధారపడే, స్వతంత్ర ప్రతిపత్తి లేని నీడను నమ్ముకోవడం కన్నా, శాశ్వతు డైన భగవంతుడి ఛాయలోకి చేరడం శ్రేష్ఠం.
ప్రేమను పంచిన మహర్షి

పదహారేళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమ య్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకొని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలూ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్దరించాలన్న తాప త్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే! అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ధమైన చూపులు, అన్ని జీవరా శులపై కురిపించే దయ మరువలేనివి.

నిరంతరం ఆత్మానందంలో ఓలలా డుతూ, మౌనదీక్షలో ఉండే రమణులు, భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనా తీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. 'ఎదుటివారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం' అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో.. తమకూ ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది.

రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా, కూరగాయలు తరుగు తున్నా- సదా సంతోష భరితులై, ఆత్మని ష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే 'తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్త వానికి ప్రతి వ్యక్తీ దైవిక సంపన్నుడే. బలాఢ్యుడే! అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరి కలు, భావాలు- ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు' అని ఆత్మ విశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా? అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు 'ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటు వంటి మనసు భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మన సుకు ఆహారం. వాటిని నిలివేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగిన వారు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం' అనేవారు. అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో 'మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది. జరగనిది జరగనే జరగదు' అని ఉపదేశించారు.

శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. 'కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కానీ, ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు' అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు.
అగ్నిసాక్షిగా వివాహం అంటే?

వివాహ సమయంలో వరుడు- వధువుతో

సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః త్రుతీయాగ్నిష్టే పతిః తురీయస్తే మనుష్య చౌః

అంటాడు. అంటే- నిన్ను ఆరంభంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. నాలుగో వానిగా నేను నిన్ను ఏలుతాను- అని అర్థం. ఇందులోని అంతరార్థం ఏమిటంటే.. అమ్మాయి పుట్టిన వెంటనే ఆమె ఆలనాపాలనా సోముడు లేదా చంద్రుడు చూస్తాడు. చంద్రుణ్ణి ఎన్నిసార్లు చూసినా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. పాపాయి కూడా అంతే. అందుకు కారణం చంద్రుని పాలన. వయసు వచ్చాక ఆమెని గంధర్వునికి ఇవ్వటంతో అతడు స్వీకరిస్తాడు. 'లావణ్యవాన్ గంధర్వః' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అందచందాలను ఇచ్చేసి 'నా పనైపోయింది, ఇక నీదే పూచీ' అని కన్యను అగ్నికి అప్పగిస్తాడు. అలా అగ్ని ఆమెనిని స్వీకరించాడు. 'అగ్నిర్వై కామ కారకః' అన్నట్టు అగ్ని ఆమె శరీరంలో కామాగ్నిని ప్రవేశపెడతాడు. చంద్రుని ద్వారా ఆకర్షణను, గంధర్వుని ద్వారా లావణ్యాన్ని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందిన కన్య వివాహానికి యోగ్యురాలైంది. ఇప్పుడు అగ్ని- వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులను పిలిచి 'దదామీత్యగ్నిర్వదతి.. ఇక ఈ కన్యని వరునికి ఇవ్వదలచుకున్నాను' అని చెబుతాడు. అందుకు వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులు అంగీకారాన్ని తెలియజేస్తారు. వివాహానికి యోగ్యురాలైన అమ్మాయిని వేరొకరికి అప్పగించి తను వెళ్లాలి కనుక వరునికి ఇస్తాడు. అతడామెని అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందువల్లే 'అగ్నిసాక్షిగా వివాహం'

అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
రేపటి గెలుపు పిలుపు

మన ఎదురుచూపుల చివరి రోజు రానే వచ్చింది. రేపటినుంచి మరో కొత్త సంవత్సరం మొదలవుతుంది. నిత్యనూతనుడైన సూర్యుడు
కొత్త కాంతులతో వేనవేల వెలుగు రేకలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు. జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆనంద ప్రదాత. సూర్యుడు శాశ్వతం కానీ, జీవన కాలం శాశ్వతం కాదు. ప్రతిక్షణం వేళ్ల సందులోంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతుంటుంది. ఆ సంగతి తెలిసీ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎదురుచూడటమే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలో అన్నింటికి శక్తినీ తేజస్సునూ ఇచ్చేది- కనిపించే సూర్యుడు.

అయితే అతడి వెనక, ఈ విశాల విశ్వం వెనక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మా రవి. అతడే జ్ఞాన భాస్కరుడు. పగలనక, రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావరజంగమాత్మక ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు. రేపటికి అతడే ఆధారం. అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో కొత్త కోర్కెలతో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రహ్లాదుడి కోసం వచ్చిన నారసింహస్వామిలా దైవం రావాలి. చెడును చీల్చి చెండాడి, మంచికి పట్టం కట్టాలి. దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై, రేపటికోసం రంగురంగుల చిత్రాలెన్నో గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనుస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించడమనేది జన్మహక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని, నేటిని విత్తనాలుగా నాటి, రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరపడగానే, రాబోయే నూతన సంవత్సరానికి మరో ఆశల, ఆనందపు తెరను తీద్దాం. దేవుళ్లకు ప్రణమిల్లి వేడుకుందాం.. సత్యం వైపు నడిపించమని! కాలం ఇంద్రజాలంతో మాయ చేసినా తట్టుకుని నిలబడే శక్తిని ఇమ్మనమని!!

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... మంచిని పదే పదే స్మరించుకోవాలి. చెడుని విస్మరించాలి. చెయ్యబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. 'భూత, భవిష్యత్, వర్తమానాలు నేను' అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటోంది బైబిలు. దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్తు అంటోంది ఖురాన్.

ఈరోజు మనం నిజాయతీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది రాబోయే రోజులన్నింటిని మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురుచూద్దాం. కొత్త సూర్యుణ్ని ఆహ్వానిద్దాం. సంతోషాలు, ఆనందాల కేరింతల్లో మునిగి నీతి, నియమాలు జీవన విలువలు విస్మరించవద్దు. గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరికీ పిలుపు!!
శుభ సంకల్పం

సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు, అనుభూతితో. ఒక బ్యాంకులో ఏరోజుకారోజు ఉదయమే మన ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయనుకుందాం. మొత్తం ఆరోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తాం. డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం. అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరు 'కాలం'. ప్రతి రోజూ 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. కాలం అందరికీ సమంగానే ఉంటుంది. టైమ్ లేదు- అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా.. లేదా అన్నది ముఖ్యం.

కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను,విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతూంటుంది. ఆ నిధి చివర్లో మన కళ్లముందు కదలాడుతుంది. జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే- మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఒక రచయితో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ, చేయబోయేదాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్లాలి. అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. 'కాలం ఎగిరిపోతుందన్నది చెడ్డవార్త. దానిని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త' అంటారు ఒక అమెరికన్ రచయిత. అశుభం శుభం ఎప్పుడవుతుందంటే- కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పుడు. ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే, 365 రోజుల తరవాత ఒక మంచి ముగింపునూ సృష్టించగలం. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే. ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు.

కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటాం. వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడిలేదు. ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం శీతలం, సుఖం దుఃఖం, జయం అపజయం.. ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి ఆనందాన్ని అన్వేషించడం ఆపి, ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుక్కోమని, అదే శాశ్వతమని, దానికి భక్తియోగం మార్గమని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయనూగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది. విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆ ఆలోచనే. సహనం, సమయాలను మించిన యోధుల్లేరు అంటారు టాల్స్టాయ్. ఆ యోధుల్ని మన సొంతం చేసుకుంటే చాలదూ!
ప్రాణస్నేహితులు

సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృ హరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతః కాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.

స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుత మైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టు వులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడ గలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.

స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజా యతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావా లుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధార ణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణస్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.

'నీకు నేనున్నాను, నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువులాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహి తుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్ట వంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.

నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.

తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచు కోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.
జ్ఞాన స్వరూపం

భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో రామకృష్ణ పరమహంస ముఖ్యులు. పరమ గురువైన వారి ఉపదేశాలు లౌకిక వాసనల్ని చెరిపేసి ఆధ్యాత్మికపథం వైపు నడిపిస్తాయి. వ్యక్తి ఆలోచనా విధానాలను సమూలంగా మార్చేస్తాయి. రామకృష్ణుల దగ్గరికి వివిధ రకాల మనస్తత్వాలు కలిగినవారు వచ్చి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు.

విషయం ఏదైనా ఆయన చిరునవ్వు చిందిస్తూ నవ్వించే మాటలతో చిన్న చిన్న కథల రూపంలో హృదయాలకు హత్తుకొనేలా బోధించేవారు.

ఒకసారి ఓ భక్తుడు సమదృష్టి గురించి తెలియజేయమనగా ఆయన ఇలా మొదలెట్టారు- సంసారజీవితం పట్ల విసుగు చెందిన ఒక జంట తీర్థయాత్రలకు బయలుదేరింది. భర్త వెనకాలే నడుస్తోంది భార్య. దారిలో అతడికి ఓ వజ్రం కనిపించింది. భార్య చూస్తే దానిమీద ఆశపడి వైరాగ్య స్థితిని పోగొట్టుకుంటుందేమోనని దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అది గమనించిన ఇల్లాలు 'వజ్రానికీ మట్టిగడ్డకూ మీకు తేడా కనిపిస్తూంటే ఇక సన్యసించడం ఎందుకు?' అంది.

వజ్రానికి, మట్టిగడ్డకు తేడా తెలియని సమదృష్టి కలిగి ఉండటమే వైరాగ్యం. ఉచ్ఛ, నీచ భేదభావం లేని సమభావమే వైరాగ్యానికి పరాకాష్ఠ అని రామకృష్ణులవారు విశదంగా చెప్పారు.

ఓ నడివయస్కుడు సన్యాసం గురించి అడిగాడొకసారి. దానికి సమాధానంగా 'నాయనా! అందరూ సన్యసించలేరు. కోరికలనేవి లేకుండా కరిగిపోయినప్పుడే అది సన్యాసం అవుతుంది. ఓ యోగి రాజును ఓ ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. 'రాజా! మీరు అటు పక్కకి వెళ్లి ఏకాగ్రతతో భగవంతుణ్ని ధ్యానించండి. నేను పిలిచినప్పుడు రండి' అని చెప్పి పంపాడు. కాసేపట్లోనే రాజు తిరిగి వచ్చి 'స్వామీ! ఏకాగ్రత నావల్ల కాదు.

రాజ్యం గురించిన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు. ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది' అని చెప్పేశాడట. వైరాగ్యం కానీ, సన్యాసం కానీ అంత సులభమైనవి కావు' అని చెప్పారు పరమహంస.

ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రశ్నించిన మరో భక్తుడికి 'ఆత్మజ్ఞానం అశాంతిని దూరం చేస్తుంది. మనుషుల్లో నైతిక విలువల్ని పెంచుతుంది. ఒడుదొడుకుల మానసిక స్థితికి శాంతిని చేకూరుస్తుంది. దుఃఖితుల హృదయాలను సాంత్వనపరుస్తుంది' అని చెప్పేసరికి ఆయన ముందు ముకుళిత హస్తుడై తలవంచాడు.

రామకృష్ణుల తండ్రి మరణానంతరం తల్లి విచారంతో రోజురోజుకూ చిక్కి శల్యమైపోతుండేవారు. అది గమనించి 'అమ్మా! మనిషికి చావు పుట్టుకలు తప్పవు. నిన్న నాన్న, రేపు నువ్వు, తరవాత నేను... ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచి వెళ్లిపోక తప్పదు. బాధపడటం మాని భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై జన్మ ధన్యం చేసుకో' అంటూ తల్లిని ఓదార్చారు. ఇలా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను ప్రజావాహినికి తెలియజేసిన మహర్షి- రామకృష్ణ పరమహంస. ఆత్మానంద అన్వేషణలో భాగంగా తమను తాము సంస్కరించు కోవాలనుకునే వారికి ఆయన బోధలు దారిదీపాల వంటివి.
ఇద్దరూ ఇష్టులే!

వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న గదిలో అబూ బెన్ ఆథమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడికో కల వచ్చింది. అందులో ఒక దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తూ ఉంటుంది.

'ఏం రాస్తున్నావు?' అడిగాడు అబూ. 'దేవుణ్ని ప్రేమించే వాళ్ల పేర్లను' చెప్పింది. 'నా పేరుందా' ఆత్రంగా అడిగాడు. 'ఊహూ.. లేదు.'

'అయితే... తోటి మనుషులను ప్రేమించే వ్యక్తిగా నా పేరు రాయవా' అని వేడుకున్నాడు. ఆ దేవదూత అంతర్థానమైంది.

రెండో రోజు మళ్లీ కల. మళ్లీ ఆమె... 'భగవంతుడు ఎవరి ప్రేమను దీవించాడో వారి పేర్లను రాస్తున్నాను' అంటూ ఆ జాబితాను చూపింది.

అందులో మొదటి పేరు అతడిదే.

'అబూ బెన్ ఆథమ్' అన్న ఈ ఆంగ్ల కవిత రాసింది జేమ్స్ హెన్రీ లీ హంట్. ఆ కవిత ఆయన ఊహించనంత పేరు ప్రఖ్యాతులను తెచ్చింది.

కవితలో మానవత్వానికి పెద్దపీట వేయటమేదానికి కారణం. కవితారంభంలో ఉన్న వాక్యం.. 'అబూ బెన్ ఆథమ్... అతని వంశం వర్థిల్లుగాక!' అన్నదీ ఒక కారణమే. తోటివారిని ప్రేమించేవారిని దేవుడు దీవిస్తాడని చెప్పడం... ఎంత గొప్ప భావన!

మాధవుణ్నే పూజిస్తూ ఆయనను చేరవచ్చు. అలా కాక, తోటి మానవులకు సేవ చేస్తూ కూడా ఆయనను చేరవచ్చు. మార్గమేదైనా దానిలో ప్రేమ ఉండాలి. ఇది అంతస్సూత్రం. ఆయన ప్రేమను, ఆశీస్సులను పొందాలంటే మన ప్రేమను ఇతరులకి పంచాలి. అంతే. అంతకన్నా ప్రత్యామ్నాయం లేదు. భగవంతుణ్ని ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి అక్కడకు వెళ్లి ప్రార్థిస్తుంటారు కొందరు. దైవమంటే వారికి పూర్తి విశ్వాసం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటారు.

దైవబలం కారణంగానే ఇంతటితో ప్రమాదం తప్పిందంటారు. చేసే పరోపకారం, దానం, ధర్మం అన్నీ దైవాన్ని తలచుకునే చేస్తారు. విశ్వంలోని అణువణువులో దైవాన్ని దర్శిస్తారు.

సర్వాంతర్యామికి ఒక నిర్దేశిత స్థలమా? ఈ సకల చరాచర సృష్టి ఆయనదే అయినప్పుడు ఆయన లేనిదెక్కడ? అని భావిస్తారు మరికొందరు. వీరు తోటివారిని ప్రేమిస్తూ, వారికి కావాల్సిన సేవలు చేస్తూ దేవుణ్నే సేవిస్తున్నట్టు భావిస్తారు. పేదలకు అన్నవస్త్రాలనిచ్చి కాపాడతారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుంటారు. పరోపకారమే ఊపిరిగా జీవిస్తారు. అందులోనే ఆనందాన్ని పొందుతారు.

భగవంతుడికి ఈ రెండూ ప్రియమైనవే. ఇద్దరూ ప్రీతిపాత్రులే. పండితులు, జ్ఞానులు, మతగ్రంథాలు చెప్పే ఈ ఉదాత్త భావననే పై కవిత ఇంకొకసారి చెబుతోంది. తన ఉనికిని ప్రశ్నించే ఇటువంటి వారినీ దైవం మెచ్చుకుంటాడు. ఎందుకంటే వీరు సాటి మనిషికి సాయపడటం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని భావిస్తారు. మొదటిది భక్తి మార్గం. రెండవది సేవా మార్గం. రెండింటి లక్ష్యం ఒకటే... సమాజంలో మానవతా పరిమళాలను వ్యాపింప జేయటం.
అపార్థాలు ఆధ్యాత్మికోన్నతికి అవరోధాలు!

మాయావి అనే రాక్షసుడు వాలి పాలిస్తున్న కిష్కంధపై ఓసారి యుద్ధానికి బయల్దేరాడు. వాలి కూడా ఎదురుదాడికి దిగాడు. అన్నకు అండగా సుగ్రీవుడూ వెంటవెళ్లాడు. వాలి, సుగ్రీవులను చూసి మాయావి గుహలోకి ప్రవేశించాడు. తమ్ముణ్ణి గుహ ద్వారం దగ్గర ఉండమని చెప్పి, వాలి లోనికి వెళ్లాడు. రోజుల తరబడి గుహలో యుద్ధం కొనసాగింది. వాలి తిరిగి రావటం లేదు. ఒకరోజు గుహ నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు వచ్చింది. రాక్షసుల గర్జనల ధ్వనులు, నిస్సహాయమైన వాలి ఆక్రందనలు సుగ్రీవుని చెవిన పడ్డాయి. రాక్షసులు అన్నను మట్టుపెట్టి ఉంటారని, గుహను మూసేసి కిష్కింధకు తిరుగు పయనమయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యభారాన్ని చేపట్టాడు. కొన్నాళ్లకు వాలి మాయావిని చంపి కిష్కింధకు తిరిగొచ్చాడు. పట్టాభిషిక్తుడై ఉన్న సుగ్రీవుణ్ణి చూసి వాలి అపార్థం చేసుకున్నాడు.

రాజ్యకాంక్షతో తమ్ముడు తనను మట్టుపెట్టాలనే ఉద్దేశంతో గుహద్వారాన్ని మూసేశాడని అనుమానించాడు. అపార్థంతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అనర్థాన్ని కొనితెచ్చుకుని శ్రీరాముడి చేతిలో హతమయ్యాడు. అలాగే చిత్ర కూటంలో రామలక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు, దూరంగా వస్తున్న భరతుణ్ణి, అతని సేనను చూసి సౌమిత్రి అపార్థం చేసుకున్నాడు. భరతుడు తమపై యుద్ధానికి వస్తున్నాడనుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు 'శుభలక్షణ సంపన్నుడైన భరతుడు బాధతో, పినతల్లి కైకేయిని నిలదీసి ఉండవచ్చు. నాన్నను ప్రసన్నుని చేసుకుని, రాజ్యాన్ని నాకు అప్పగించాలనుకుని ఇక్కడికి వస్తున్నాడేమో! తమ్ముడు నాకు అపకారం చేయాలని ఎన్నటికీ తలచడు' అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అందుకే ఆయన లోకానికి ఆరాధ్యనీయుడయ్యాడు. అపార్థాలు మన అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకులని నిరూపించాడు.
అందరిలో నారాయణుడు

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు... అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదేపనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూంటారు. గురివింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి.

నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు, దోషాలు ఉన్నంతమాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు. రూప భేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసులకు లేవు. ప్రతీ ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవినీ ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు.

అందుకే వృత్తి వల్లనో, రూపాన్నిబట్టో, బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.

ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుందన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది. అల్పవస్తువులు, అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు.

తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి, తండ్రిని చెరనుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి
అణచివేశాడు.

అధికారం, ధనం, అందం వీటివల్ల మనిషికి కీర్తిప్రతిష్ఠలు లభించవు. మంచి నడవడి, సాయపడే గుణం, పాండిత్యం, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు. తియ్యని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేపచెట్టు నిరాదరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అంధులైనా, మూగవారైనా, కటిక పేదలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. రెండుపదుల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టినా చాలాకాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ప్రదర్శనలిచ్చాడు బీథోవెన్. కటిక దారిద్య్రం వెంటాడినా మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం.

వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంక ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది. వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.

సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగినవాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వసమభావనతో అందరినీ ప్రేమించేవాళ్లే ప్రజల మనుషులుగా ఎదుగుతారు. లోకకల్యాణం కోసం పాటుపడతారు.
సమయం రావాలి!

ఒకసారి ఓ సాధువు శిష్యులతో ఓ గ్రామంలో బస చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు. అది తెలిసి పొరుగూరి రామయ్య, భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు. తమ గోడు విన్నవించుకున్నారు. 'మమ్మల్ని దరిద్రం పట్టిపీడిస్తోంది. మాకు నిధి నిక్షేపాలక్కరలేదు. మడులూ మాన్యాలక్కరలేదు. కడుపునిండా తిండి దొరికే మార్గం చూపండి స్వామీ!' అని వేడుకున్నారు. సాధువు సంచిలోంచి ఒక పొట్లం తీసి, దాంట్లోంచి రెండు విత్తనాలు ఇద్దరికీ ఇచ్చాడు. 'వీటిని తీసుకెళ్లి నాటండి.

మొక్క పెరిగి మధురఫలాలను ఇస్తుంది. వాటి రుచి అమోఘం. మంచి ధర పలుకుతుంది. మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా, ఆకలిబాధ లేకుండా ఆదుకుంటుంది' అన్నాడు. వాళ్లు సంతోషించారు. తిరిగెళ్లాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు. నాటిన దగ్గర్నుంచీ రామయ్య గింజ ఎప్పుడు మొలుస్తుందా అని ఎదురు చూసేవాడు. వారమైంది, పదిరోజులైంది.

మొలక రాలేదు. తవ్వి చూస్తే విత్తనం అలాగే కనిపించింది. ఇంకేం మొలకెత్తుతుందని కోపంగా తీసి పారేశాడు. మరో వారం తరవాత భీమయ్య పాతిన గింజ మొలిచింది. చకచకా ఎదిగి కాపు పట్టింది. మధురమైన ఆ పండ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు. గుడ్డు నుంచి కోడిపిల్ల రావటానికి 21 రోజులు పడుతుంది. గర్భంలోని శిశువు భూమ్మీద పడటానికి తొమ్మిది నెలలు పడుతుంది.

ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు.

ఒక్కోసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు. అలాంటప్పుడు కుంగిపోవడం, నిగ్రహం కోల్పోవడం తగదు. బాణభట్టారకుడనే మహాకవి పద్దెనిమిదేళ్లకే 'కాదంబరి' అనే గ్రంథం రాసి, రాజాశ్రయానికెళ్లాడు. అక్కడున్న పండితులు ఇతణ్ని హేళన చేశారు. 'కాదంబరి' అంటే కల్లు. కల్లు తాగితే రుచి తెలియదని రాజు భావించి పరిపక్వత లేదు, పొమ్మన్నాడు.

బాధపడిన బాణుడు ఇంటికెళ్లి కోపంతో కావ్యాన్ని తగలెట్టాడు. రెండురోజుల తరువాత కాళిదాసు వెళ్లి 'అబ్బాయ్, నీ కాదంబరిని మరోసారి వినిపించు' అంటే బాణుడు తెల్లముఖం వేసి విషయం చెప్పాడు. 'సరేలే, నేను చెప్తా రాసుకో అని ఏకసంధాగ్రాహి అయిన కాళిదాసు తాను విన్న కాదంబరిని ఉన్నదున్నట్లుగా అప్పజెప్పాడు.

లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రచారంలో ఉన్న కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతుంది.

మరికొందరుంటారు... పర్యవసానం గురించి ఆలోచించకుండా తోచిన పని చేసేస్తారు.

అవివాహిత అయిన కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని ముందుచూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపుకోత అనుభవించింది. ఏ పనికైనా ముందు వెనకలు ఆలోచించి, సమయాసమయాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి.
భోగి భాగ్యాలు

సంక్రాంతి సంబరాల్లో తొలి వేడుక భోగి. సంప్రదాయ వైభవానికి ఇది మనోజ్ఞ వేదిక. సస్యలక్ష్మి అనుగ్రహంతో సంపదలు దక్కిన తరవాత ఆ ధనాన్ని, ఆనందాన్ని అందరితో సమష్టిగా ఆస్వాదించాలనే ఆకాంక్ష భోగి నేపథ్యంగా వ్యక్తమవుతుంది. పంచుకోవడంతోనే సంతోషం పెంచుకోవాలనేది ఈ పండుగ పరమార్థం. సమస్త సౌభాగ్యాల సమృద్ధి- భోగి! శ్రమశక్తి, దైవకృప, ప్రకృతి అనుగ్రహాల మేలు కలయిక- భోగిపర్వం. జడత్వాన్ని ఛేదించి, నవ్యత్వం దిశగా స్ఫూర్తిమంతంగా ముందడుగు వేయాలనేదే భోగి అందించే ఆత్మీయ సందేశం.

మకర సూర్యుడు మనోహరంగా ప్రకాశించడానికి ముందు భోగి మంటల రూపంలో హారతుల్ని స్వీకరిస్తాడు. ఇంద్రుడు వర్షకారకుడై ప్రకృతికి పచ్చదనాన్ని అందిస్తాడు. పంటల్ని పుష్కలంగా పండిస్తాడు. అందుకు కృతజ్ఞతగా భోగి మంటల్ని ఏర్పాటుచేస్తారు. ఇంద్రుడికి సమర్పించే భోగి మంటను ఇంద్రాగ్నిగా వ్యవహరిస్తారు. భోగి అంటే విష్ణువు అనే అర్థమూ ఉంది. శ్రీహరిని భోగినాడు భోగేంద్రనాథుడిగా ఆరాధిస్తారు. లోకానికి ప్రాణశక్తిని అనుగ్రహించే సూర్యుణ్ని వైభోగిగా కీర్తిస్తారు. భోగిపళ్ల వేడుకతో సూర్యారాధనను ఆరంభించి, రథ సప్తమి వరకు నియమపూర్వకంగా కొనసాగించే సంప్రదాయం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభమంగళ తోరణమై వర్ధిల్లుతుంది. హేమంత రుతువులో ప్రకృతికి సౌందర్యత్వాన్ని, భోగత్వాన్ని ఆపాదించేది కాబట్టి ఈ పండుగను 'భోగి'గా పేర్కొంటారని 'సూర్యతంత్రం' వివరించింది.

రంగనాథుణ్ని పతిగా పొందాలని గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించింది. ఆ సిరినోము పండిన శుభతరుణమే- భోగి. ఆత్మకు గోదాదేవి ప్రతీక. పరమాత్మకు రంగనాథుడు సంకేతం. ఆత్మ పరమాత్మల సమ్మేళనం మధుర భక్తితో సుసాధ్యమని ఆండాళ్ నిరూపించింది. ద్వాపర యుగంలో 'నందనందనోత్సవం'గా భోగిని నిర్వహించేవారని భాగవతం పేర్కొంది. భోగినాడే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రకృతి వైపరీత్యాల నుంచి గోకులాన్ని రక్షించాడంటారు. అందుకే భోగినాడు 'గోవర్ధనగిరి పూజ' చేస్తారు. భోగి సందర్భంగా 'గొబ్బిగౌరి వ్రతా'న్నీ చేస్తారు. ఇంటి ముంగిట అలంకరించే ముగ్గులో పెద్ద గొబ్బెమ్మను, దాని చుట్టూ చిన్న గొబ్బెమ్మలను పెడతారు. ఇవి కృష్ణుడికీ గోపికలకు ప్రతీకలు. ఈ గొబ్బిళ్లను శ్రీకృష్ణ తత్వానికే కాక, శివలింగ స్వరూపాలకూ సమన్వయం చేస్తారు. గోమయంతో చేసే శివలింగార్చననే- గొబ్బిగౌరి వ్రతంగా పేర్కొంటారు.

భోగికి ఉన్న అర్థాల్లో సర్పం ఒకటి. కాలాన్ని సర్పంతో పోల్చడం తెలిసిందే. కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారికి అంతా లాభం జరుగుతుందని భోగి ఆంతర్యం. భోగం అంటే ఉత్తమయోగం. అన్ని పరిణామాలను సాదరంగా స్వీకరిస్తూ, సానుకూలంగా మసలుకోవాలని ఈ పండుగ తెలియజేస్తోంది. గోవిందుడు, గోదాదేవి, గొబ్బెమ్మలు, గోమాత అనే నాలుగు అంశాల నేపథ్యంగా ప్రకృతిలో పూర్ణత్వాన్ని దర్శించాలని, అందుకు భోగినాటి సంప్రదాయాలు ఉపయుక్తమవుతాయని వ్రత చింతామణి ప్రకటించింది. నేటి భోగిపర్వం రేపటి సమ్యక్ క్రాంతి.. సంక్రాంతికి సంకేతం.
సస్య కాంతి సంక్రాంతి

సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక 'ఉత్తర క్రాంతి' అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ఏడాదికి పన్నెండు సంక్రాంతులొస్తాయి. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు.

దక్షిణాయనంలో వర్షాలు, చలితో రోగాలు, వాతావరణ కల్లోలాలకు ముగింపు పలుకుతుంది. ఉత్తరాయణం. ఆరోగ్యకారకం, ఆహారసాధకం, ఆనందదాయకం, ఆధ్యాత్మికపూరకమైన విశిష్టకాలమిది. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైంది.

ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందేలు, భోగిమంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెరుకుగడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్య రాశులు, భోగిపండ్లు- ఇలా సరదాలూ సంతోషాలూ పంచుతుంది.

మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలీ ప్రకాశిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల ముచ్చటైన పండుగిది. ఈ మూడు రోజుల విశిష్టతను తెలుసుకుంటే సంక్రాంతి శోభ అర్థమవుతుంది.

లక్ష్మీనారాయణులు దీవిస్తారు మహావిష్ణువుకు బదరీవృక్షం (రేగి) ప్రీతికరమైందని, అందుకే ఆ స్వామి బదరికా వనంలో విహరిస్తాడని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. భోగి రోజున రేగిపండ్లను చిన్నారుల తలపై పోస్తారు. పండ్లతో పాటు నాణేలు కూడా చేర్చడంతో లక్ష్మీదేవి అనుగ్రహమూ చేకూరుతుందని విశ్వసిస్తారు. అలా భోగి పండ్లతో లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ప్రత్యక్షంగా అందుతుంది. ఎర్రగా, గుండ్రంగా ఉండే రేగిపండ్లను సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. ఇవి ఆరోగ్యకారకం కూడా. బొమ్మల కొలువులతో సందడి చేస్తారు. గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభదినం కనుక దేవాలయాల్లో గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరిపిస్తారు.

గాలిపటం.. అంతరార్థం శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుణ్ణి దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తాయి. భగవదాశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది. ఈ అంతరార్థం తెలిసినా, తెలియకున్నా గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకరజ్యోతి సందర్శనం లభించేది కూడా సంక్రాంతి పర్వదినానే. భోగభాగ్యాల భోగి

భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైంది అన్నది పురాణ వచనం. ఈ రోజు ఇంద్రుణ్ణి, ఇష్టదేవతలను పూజిస్తారు. తెల్లవారు జామున ఇంటి ముందర, కూడళ్లలో భోగిమంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకే ఈ ఆచారం, దీని వల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. వాతావరణ కాలుష్యమూ దూరమవుతుంది. యజ్ఞ దేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగిమంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులూ వేస్తారు.

ఆపై అభ్యంగన స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్తబియ్యం, కొత్తబెల్లంతో పొంగలి వండి భగవంతునికి నివేదిస్తారు.

సంబరాల క్రాంతి

మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైంది సంక్రాంతి. ఉదయాన్నే సూర్యనమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది ఈ రోజే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక చేస్తారు. ఈ రోజు స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి పూజిస్తారు. ముత్తయిదువులకు పూలూపండ్లను వాయనంగా ఇస్తారు.

సంక్రాంతి ముగ్గుల పండుగ. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడతాయి. గీతలతో, చుక్కలతో తీరు తీరుగా రూపు దిద్దుకుంటాయి. మధ్యచుక్క సూర్యుడి ప్రతిరూపంగా, చుట్టూ ఉన్నవి గ్రహాలకు ప్రతీకలుగా భావిస్తారు. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి. ముగ్గులు వేసే సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసే స్నేహానుబంధం, ఆరోగ్య రహస్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. పండుగలో గొబ్బెమ్మలదీ ముఖ్య పాత్రే. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు గొబ్బెమ్మల వల్ల నయమవుతాయి.

కనుమ.. పశువుల పండుగ

సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు.

పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి, కొంత పశువులకు తినిపించి, మిగిలినదాన్ని పొలాల్లో జల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పశువుల శ్రమతోనే పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా వాటిని పూజించి, గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికి పూజ చేస్తారు. 'కనుమ నాడు కాకి కూడా కదలదు' అన్న నానుడి తెలిసిందే కదా! అందుకే ఆరోజు ఏ పనికీ వెళ్లరు, ప్రయాణం కూడా చేయరు.
'కనుమ నాడు మినుము కొరకవలె' అన్న లోకోక్తి ప్రకారం గారెలు

తింటారు.

'ముక్కనుమ' కనుమ తోటిదే. ఆరోజు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు సావిత్రీ గౌరీ వ్రతం చేసి, అమ్మవారి బొమ్మలతో బొమ్మలనోము నోచుకుంటారు. గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి, తొమ్మిది పిండి వంటలను నివేదిస్తారు. తర్వాత ఆ మట్టిబొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు.

మూడు రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతీ

సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలూ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం.
సరస్వతీ ప్రసాదం

మధుర సంభాషణే అసలైన అలంకారం. కఠినమైన మాటతీరు అనర్థదాయకం. మన్ననగా మాట్లాడమన్నారు పెద్దలు. మధుర వాక్కులకు ఉదాహరణ హనుమ. సీతమ్మను అన్వేషిస్తూ వెళ్లిన సందర్భంలో తమతో హనుమ మాట్లాడిన తీరును రాముడు ఎంతో మెచ్చుకున్నాడు. 'ఒక్క అపశబ్దం లేకుండా, వ్యాకరణ శాస్త్ర ప్రావీణ్యం కలిగినట్లుగా వినసొంపుగా సంభాషించాడు. ఇతడి వాక్చాతుర్యాన్ని గమనిస్తే క్రూరులు సైతం శాంతించి, ఎత్తిన కత్తిని దించి తీరాల్సిందే' అన్నాడు. జీవితం సజావుగా సాగాలంటే.. మాటతీరు మన్ననగా ఉండాలి. సమయోచితంగా మాట్లాడాలి. 'మాట' సరస్వతీమాత ప్రసాదించిన వరం. 'వాగ్భూషణం భూషణం' అన్నది భర్తృహరి సుభాషితం. అంటే వాక్కే అసలైన ఆభరణం అని భావం. మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి.

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మిః
జిహ్వాగ్రే మిత్రబాంధవాః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః
జిహ్వాగ్రే మరణ ధృవం

మాట వైఖరి బాగుంటే బంధుమిత్రులు లభిస్తారు. సంపదలు ప్రాప్తిస్తాయి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. లేదంటే చిక్కుల్లో పడొచ్చు, సంపదలు కోల్పోవచ్చు, ప్రాణహాని కూడా సంభవించవచ్చు. కనుక మధురభాషణ అలవరుచుకోవాలి.
జ్ఞానసిద్ధి కోసం...

భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం... ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది. భగవత్తత్వ అవగాహనలో మొదటి మెట్టు విగ్రహారాధన. భక్తికి ఒక ఆలంబన అవసరమన్నది మహర్షులు చెప్పిన మాట.

ప్రతిష్ఠించిన విగ్రహం వల్ల భక్తి పుడుతుంది. లక్ష్యం నిలవడానికి, ఏకాగ్రతకు ఓ రూపం అవసరం.

భగవంతుడు పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా అనే అయిదు తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి. ఈ అయిదింటిలో అర్చామూర్తి- విగ్రహ రూపంలో ఉంటాడు.

ఇటువంటి మూర్తిలోనే భక్తుడు తన ఇష్ట దైవాన్ని కొలుచుకుంటాడు. విగ్రహం వలన భక్తులు ఉపాసన చేసుకోవడానికి వీలవుతుంది.

ఉపాసకుడి కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరుడు ఓ రూపం దాల్చాడని పెద్దలు చెబుతారు.

పరబ్రహ్మ తత్వం అర్థమైన వారు నూటికొక్కరు ఉంటారు. అటువంటివారు 'హరిమయము విశ్వమంతయు' అనుకోగలరు. కానీ, సామాన్య భక్తులు ఇంతటి అవగాహనకు రాలేరు. వారికి నిత్యజీవిత కార్యకలాపాల్లో 'దేవుడు' ఒక భాగం. సాధారణ సాధకులు 'మూర్తి'ని దైవంగా భావించి సాధన చేస్తే మనసులోనే మహేశ్వరుడు ఉన్నాడనే దైవత్వ భావన కలుగవచ్చు. మనుషులంతా ఒకే రకమైన స్థాయిలో మానసిక పరిపక్వత ఉన్నవారు కారు. అందువల్ల ఆయా స్థాయి భేదాలు కలిగిన వారికోసం... భక్తి మార్గంలో వారు తరించడం కోసం విగ్రహారాధన తోడ్పడుతుంది. 'ప్రతిమా

స్వల్ప బుద్ధినాం యోగినాం హృదయే హరి:' అన్నారు పెద్దలు. ఇది అత్యంత విశాలమైన ప్రాతిపదిక కలిగిన స్వేచ్ఛాయుతమైన ఉపాసనా మార్గం. సాధకుడికి ప్రాథమిక దశలో విగ్రహారాధన అవసరం. పరిపక్వత సాధించిన వారికి మనసే మందిరమవుతుంది.

ఒక దేవతనే ఆరాధించమని హిందూ ధర్మం చెప్పదు. 'సర్వ దేవత నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి' అని సూక్ష్మంలో మోక్ష సూత్రం చూపారు రుషులు. రత్నం, బంగారం, శిల, మట్టి, కర్ర, స్పటికం, వెండి, రాగి ఇలా ఎనిమిది రకాల వస్తువులు ప్రతిమా రూపకల్పనకు యోగ్యమైనవి. అర్చకుడి నిష్ఠాగరిష్టతలు, శ్రద్ధాభక్తుల వల్ల శిల భగవద్రూపంగా రూపాంతరం చెందుతుంది. మంత్ర శక్తి, భక్తుడి భావనల తీవ్రత వంటివి ప్రతిమలో దైవ చైతన్యాన్ని ప్రోది చేస్తాయి. విగ్రహారాధన వల్ల జ్ఞాన సిద్ధి లభిస్తుంది. విగ్రహం అనే మాటకు విశేషంగా గ్రహించేది అనే అర్థముంది. త్యాగరాజు విగ్రహాలు దొరికినప్పుడు 'కనుగొంటిని రాముని' అన్నారు గానీ... 'కనుగొంటిని రాముని విగ్రహాన్ని' అనకపోవడం జ్ఞానానికి చిహ్నం.
ఈ పూజతో పాపాలు తొలగుతాయి

అష్టమి తిథి బుధవారం నాడు వస్తే దానిని ‘బుధాష్టమి' అంటారు. ఈ జనవరి 22 నాడు అలా కలిసి వచ్చాయి. బుధగ్రహం విజ్ఞత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలకు సూచన. ఇవన్నీ మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే బుధాష్టమి రోజున..

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్

అని వీలున్నన్నిసార్లు జపించాలి. బుధాష్టమి శివుడికి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజని పురాణ వచనం. కాబట్టి ఈ రోజు శివకేశవులను పూజిస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది.

గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో బుధాష్టమి వ్రతం చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, బుధగ్రహాన్ని పూజించి, నైవేద్యం సమర్పిస్తారు. ఈ పూజలో బుధుడి రూపం ఉన్న బంగారు లేదా వెండి నాణేన్ని, దాని ముందు గంగాజల కలశాన్ని ఉంచి పూజ చేస్తారు. వ్రతం పూర్తయ్యాక.. ఆ నాణేన్ని దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ దోషాలుంటే.. వాటి నుంచి విముక్తి లభిస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, కైవల్యం లభిస్తుందనీ విశ్వసిస్తారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, దైవారాధన చేసినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందంటారు.
షట్తిల ఏకాదశి
పుష్యమాసలో బహళ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి , పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది.
షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట.

*షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు*

*ఆ ఆరు తిల విధులు ఏమిటంటే..*

1) తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.

2) తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి .
3) తిల హోమం - ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.

4) తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట , నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.

5) తిలదానం - నువ్వులు కాని , నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.

6) తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది)
ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు , మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడు.సుబ్బారెడ్డి

*సూచన:-* షట్తిల ఏకాదశి రోజున నిర్వహించే హోమము , దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరుపవలసి ఉంటుంది.

*షట్తిల ఏకాదశి యొక్క చారిత్రక పురాణ కథనం*

మత విశ్వాసాల ప్రకారం , నారద ముని విష్ణువును చూడటానికి వైకుంఠమును సందర్శించి , షట్తిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపమని అడిగినారు. నారద ముని విష్ణువును పట్టుబట్టిన తరువాత ,
పురాతన కాలంలో , ఒక బ్రాహ్మణ భార్య భూమిపై నివసించేది , ఆమె నాకు పెద్ద భక్తురాలు , తరచూ నన్ను ఆమె హృదయంలో పూర్తి గౌరవం , భక్తితో ఆరాధించేది. ఒక సారి ఆమె నా ఆశీస్సులు పొందటానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉంది. ఆమె శరీరం అన్ని ఉపవాసాల నుండి స్వచ్ఛంగా మారింది. కానీ ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు మరియు దేవతలకు ఎటువంటి ఆహారాన్ని దానం చేయలేదు. కాబట్టి ఈ మహిళ స్వర్గంలో సంతృప్తికరంగా ఉండదని నేను అనుకున్నాను , అందువల్ల నేను ఆమెను సాధు , బ్రాహ్మణుడిగా మారువేషంలో పరీక్షించాలనుకున్నాను.

ఒకానొకనాడు నేను మారువేషంలో ఆమెను భిక్ష అడిగినప్పుడు , ఆమె మట్టి ముద్దను తెచ్చి నా చేతుల్లో ఉంచింది. నేను దాన్ని తిరిగి వైకుంఠమునకు తీసుకువచ్చాను. కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వైకుంఠము వచ్చినప్పుడు ఆమెకు గుడిసె , మామిడి చెట్టు అందించారు. ఖాళీ గుడిసెను చూసిన ఆమె ఆందోళన చెందింది. నేను ధర్మవంతునైనప్పుడు కూడా నాకు ఖాళీ గుడిసె ఎందుకు వచ్చింది అని అన్నది. ఇవన్నీ మీరు ఆహారం దానం చేయకపోవడం మరియు నాకు బురద ఇవ్వడం వల్లనే అని నేను ఆమెకు చెప్పాను. అప్పుడు నేను ఆమెకు చెప్పాను , మీ గుడిసె యొక్క ద్వారాలు తెరవవద్దు దేవ కన్యలు షట్టిల ఏకాదశి వ్రతం కోసం మొత్తం కర్మను మీకు చెప్తారు.

దేవ కన్యలు చెప్పినట్లు ఆమె అనుసరించింది మరియు ఉపవాసం ఉంది. ఉపవాసం యొక్క ప్రభావాలతో , ఆమె గుడిసెలో ఆహార పదార్థాలు మరియు పంటలు నిండిపోయాయి. అందువల్ల , నారద , ఈ ఏకాదశి ఉపవాసం చేసి , ఆహారం మరియు నువ్వులను దానం చేసిన వారెవరైనా ఆశీర్వాదం , సంపద మరియు మోక్షం పొందుతారు.
2025/03/13 17:45:39
Back to Top
HTML Embed Code: