tgoop.com/devotional/1006
Last Update:
ఆరోగ్య జీవనం
ప్రతి మనిషి ఆరోగ్యం కోరుకుంటాడు. ఇలాంటి ఇచ్ఛ ఉండేది ఒక్క వ్యక్తికి ' మాత్రమే, అది కేవలం వ్యక్తిగతమేనా? కాదు. కార్యాలయాల్లోనూ ఆరోగ్యవంతుల్నే ఉద్యోగులుగా నియమించుకుంటారు. న్యాయస్థానాల్లో తీర్పులు వెలువరించేముందూ వాది ప్రతివాదుల (శారీరక, మానసిక ఆరోగ్యస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటారు. చట్ట సభల్లోకి అడుగు పెట్టే సభ్యుల్నీ అన్ని విధాలా యోగ్యులైన (ఆరోగ్యకరమైన ఆలోచనా దృక్పథమున్న) వారినే ఎన్నుకోజూస్తారు. దేశ భద్రతా దళాల సేనల్ని ఎంపిక చేసేటప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షిస్తారు. బావుల్లోంచి నల్లసిరులు తవ్వి తీసే సింగరేణి కార్మికుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
లోక కల్యాణార్ధమై ఏ పని చెయ్యాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఒక్క ఆరోగ్యాన్ని మాత్రమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లేనని భావిస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే అనేకానేకం సమకూర్చుకోగల సమర్థుడు. అలాంటి దృఢమైనవారే పురోభివృద్ధిలో సాధికారికంగా భాగస్వామి అవుతారు. ఆరోగ్యకరమైన మనసులోంచే సృజనాత్మక ఊటలు
జలజలా ఊరతాయి. అవి నూతనావిష్కరణలకు పురుడుపోస్తాయి. పరిశుద్ధమైన మనసు 'దీపం వెలిగే గృహం' లాంటిది. అందులోకి అరిషడ్వర్గాల చోరులు చేరరు. బదులుగా దానిలో 'సచ్చిదానందుడు' కొలువుండజూస్తాడు. ఆరోగ్యం అనేది కేవలం దేహానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది- ఏ రోగమూ లేని శరీరంతోపాటు దుఃఖానికి కించిత్తు చోటులేని మానసికం. ఆనందం, సచ్ఛీలత, పరిశుభ్రతల సమ్మిశ్రమం, నైతిక విలువలతో కూడిన జీవన గమనం.
తీసుకునేటప్పుడు కన్నా ఇచ్చేటప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందువల్లే ఎల్లప్పుడూ ఇచ్చే పంచభూతాత్మక ప్రకృతి తాజాగా ఉంటుంది. నిత్యనూతనం- ఆరోగ్యానికి పర్యాయపదం. ఆకాశమంత ఎత్తు పెరిగిన భారీవృక్షం భగభగమండే ఎండల్లో మాడుతుంది. పెను తుపానులో ఊగిపోతుంది. ప్రకృతి బాధించినా తట్టుకుని చెట్టు అలాగే నిటారుగా నిలబడే ఉంటుంది. కారణం- భూమ్మీద జీవరాశికి తనవంతు సేవలు మరికొంతకాలం అందించాలన్న బలమైన కాంక్షతో ఉండటం. ఆ కోరిక ప్రాకృతికమైంది. అదే పంచ భూతాల్లోంచి రూపుదిద్దుకొన్న మనిషికీ అలాంటి సంకల్పం ఉండాలి. అది ఆరోగ్యకరం.
'మనిషి చేసే సానుకూల ఆలోచనల ఫలితమే వారి ఆరోగ్యం... ప్రతికూల ఆలోచనలే వారి అనారోగ్యం' అని ఆధునిక వైద్యశాస్త్ర విభాగాలూ చెబుతున్నాయి. దుర్గుణాలతో కూడిన మనిషితో ఎవ్వరూ సాన్నిహిత్యం పెంచుకోరు. అంతదాకా ఎందుకు అనారోగ్యానికి గురైన లేదా దుఃఖం బారినపడ్డ మనిషినీ ఓదార్చేందుకు తనవాళ్లు సైతం చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతారే తప్ప అక్కడే ఉండిపోరు. కానీ- సత్యం, జ్ఞానం, ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, ఆప్యాయత, సానుభూతి, దానగుణం.... అనే అప్లైశ్వర్యాలతో తులతూగే మహనీయుల వద్దకు ఎంతోమంది శిష్యులుగా చేరి జీవితకాలం పాటు అక్కడే ఉండిపోతారు. "
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1006