tgoop.com/devotional/1095
Last Update:
అవన్నీ తాత్కాలికమే!
రాత్రింబగళ్లు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు... కాలచక్రంలో భాగంగా ఇవి వస్తూ, పోతూంటాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవే. కానీ కనబడుతూ, కనుమరుగ వుతూ ఉండటం వల్ల తాత్కాలికమైన వాటిలా అనిపిస్తాయి. తాత్కాలికమైనవైనా, శాశ్వతమైన వాటిలా కనిపించేవి కొన్ని ఉన్నాయి. అవి యవ్వనం, జీవితం, ఐశ్వర్యం, మనసు, నీడ, పాలకుల ప్రేమ. ఈ ఆరూ చంచలమైనవి. అశాశ్వతమైనవి. అయినా శాశ్వతమైన విషయాలన్నంతగా వీటిని గాఢంగా నమ్ముతారు చాలామంది. వీటిని తాత్కాలికమైనవని గుర్తించి, జాగ్రత్తగా మెలగాలన్నది పెద్దలు చెప్పేమాట.
యవ్వనం జీవిత దశల్లో ప్రధానమైంది. కీలకమైన ఘట్టాలను నిర్వర్తించే వయసు. సంపాదించే సత్తా, బలిమి, బింకం వాటికి తోడు కాస్త పొగరు ఉండే ప్రాయం. కాబట్టి తమకు ఎదురు లేదని, యవ్వనమే శాశ్వ తమని భ్రమిస్తారు చాలామంది. జీవి తమూ అంతే. ఎంతో, ఎన్నో, ఏదో, ఎక్కడో... ఉన్నాయనుకుని, వాటిని ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంతో చివరి దశవరకూ పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ రాశిపోసిన బియ్యంలో చెయ్యి పెట్టినవారికి పిడికెడు బియ్యమే దక్కినట్లు వారికి యోగమున్నంత మేరకే దక్కుతాయనే నిజం ఆలస్యంగా, అలసి పోయాక తెలుసుకుంటారు. నిలకడ లేని వాటిలో ఐశ్వర్యం ప్రధానమైంది. అది ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో, ఎలా వంచిస్తుందో, ఎప్పుడు ఎవరి దగ్గరకెలా చేరుతుందో, ఏ క్షణాన ఎవరి దగ్గరనుంచి ఎలా జారుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సంపద ఉందన్న గర్వం కలిగి ఉండటమంత అవివేకం మరొకటి ఉండదు. ఇలాంటివారిని ఉద్దేశించే ఆదిశం కరాచార్యులు 'ధన, జన, యవ్వన బలాలు చూసి గర్వించవద్దు. వీటన్నింటినీ కాలం రెప్పపాటులో దూరం చేస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరు విడిపిం చుకోండి' అంటూ భజగోవిందంలో హెచ్చరించారు. చిత్తం అంటే మనసు. మనిషి మనుగడను మననే నియంత్రిస్తుంది. కానీ దాన్నది నియంత్రించుకోలేదు. ఏ క్షణం ఎటు మారుతుందో చెప్పలేని స్థితి దానిది. అందుకే మనసును నియంత్రించడానికి పతంజలి మహర్షి యోగసూత్రాల్లో సూచించిన సాధనాలేంటంటే- ఏకాగ్రతతో ధ్యానం, భక్తి- వైరాగ్య భావనలు, ఆధ్యాత్మిక చింతన, కోరికలను త్యజించడం, ఇంద్రియ నిగ్రహం.
ఇక, పాలకుల కరుణ. పాలించేవాడికి ఆనందం కలిగినా, ఆగ్రహం కలిగినా ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పాలకులు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే పాలకులకు దూరంగా, పాల కడవకు చేరువగా ఉండటం మంచిదని పెద్దల మాట. సేద తీర్చడం నీడ స్వభావం. కానీ దాన్ని నమ్ముకోవడమంత అవివేకం మరొకటుండదు. వెలుగు మీద ఆధారపడే, స్వతంత్ర ప్రతిపత్తి లేని నీడను నమ్ముకోవడం కన్నా, శాశ్వతు డైన భగవంతుడి ఛాయలోకి చేరడం శ్రేష్ఠం.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1095