tgoop.com/devotional/1102
Last Update:
జ్ఞాన స్వరూపం
భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో రామకృష్ణ పరమహంస ముఖ్యులు. పరమ గురువైన వారి ఉపదేశాలు లౌకిక వాసనల్ని చెరిపేసి ఆధ్యాత్మికపథం వైపు నడిపిస్తాయి. వ్యక్తి ఆలోచనా విధానాలను సమూలంగా మార్చేస్తాయి. రామకృష్ణుల దగ్గరికి వివిధ రకాల మనస్తత్వాలు కలిగినవారు వచ్చి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు.
విషయం ఏదైనా ఆయన చిరునవ్వు చిందిస్తూ నవ్వించే మాటలతో చిన్న చిన్న కథల రూపంలో హృదయాలకు హత్తుకొనేలా బోధించేవారు.
ఒకసారి ఓ భక్తుడు సమదృష్టి గురించి తెలియజేయమనగా ఆయన ఇలా మొదలెట్టారు- సంసారజీవితం పట్ల విసుగు చెందిన ఒక జంట తీర్థయాత్రలకు బయలుదేరింది. భర్త వెనకాలే నడుస్తోంది భార్య. దారిలో అతడికి ఓ వజ్రం కనిపించింది. భార్య చూస్తే దానిమీద ఆశపడి వైరాగ్య స్థితిని పోగొట్టుకుంటుందేమోనని దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అది గమనించిన ఇల్లాలు 'వజ్రానికీ మట్టిగడ్డకూ మీకు తేడా కనిపిస్తూంటే ఇక సన్యసించడం ఎందుకు?' అంది.
వజ్రానికి, మట్టిగడ్డకు తేడా తెలియని సమదృష్టి కలిగి ఉండటమే వైరాగ్యం. ఉచ్ఛ, నీచ భేదభావం లేని సమభావమే వైరాగ్యానికి పరాకాష్ఠ అని రామకృష్ణులవారు విశదంగా చెప్పారు.
ఓ నడివయస్కుడు సన్యాసం గురించి అడిగాడొకసారి. దానికి సమాధానంగా 'నాయనా! అందరూ సన్యసించలేరు. కోరికలనేవి లేకుండా కరిగిపోయినప్పుడే అది సన్యాసం అవుతుంది. ఓ యోగి రాజును ఓ ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. 'రాజా! మీరు అటు పక్కకి వెళ్లి ఏకాగ్రతతో భగవంతుణ్ని ధ్యానించండి. నేను పిలిచినప్పుడు రండి' అని చెప్పి పంపాడు. కాసేపట్లోనే రాజు తిరిగి వచ్చి 'స్వామీ! ఏకాగ్రత నావల్ల కాదు.
రాజ్యం గురించిన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు. ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది' అని చెప్పేశాడట. వైరాగ్యం కానీ, సన్యాసం కానీ అంత సులభమైనవి కావు' అని చెప్పారు పరమహంస.
ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రశ్నించిన మరో భక్తుడికి 'ఆత్మజ్ఞానం అశాంతిని దూరం చేస్తుంది. మనుషుల్లో నైతిక విలువల్ని పెంచుతుంది. ఒడుదొడుకుల మానసిక స్థితికి శాంతిని చేకూరుస్తుంది. దుఃఖితుల హృదయాలను సాంత్వనపరుస్తుంది' అని చెప్పేసరికి ఆయన ముందు ముకుళిత హస్తుడై తలవంచాడు.
రామకృష్ణుల తండ్రి మరణానంతరం తల్లి విచారంతో రోజురోజుకూ చిక్కి శల్యమైపోతుండేవారు. అది గమనించి 'అమ్మా! మనిషికి చావు పుట్టుకలు తప్పవు. నిన్న నాన్న, రేపు నువ్వు, తరవాత నేను... ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచి వెళ్లిపోక తప్పదు. బాధపడటం మాని భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై జన్మ ధన్యం చేసుకో' అంటూ తల్లిని ఓదార్చారు. ఇలా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను ప్రజావాహినికి తెలియజేసిన మహర్షి- రామకృష్ణ పరమహంస. ఆత్మానంద అన్వేషణలో భాగంగా తమను తాము సంస్కరించు కోవాలనుకునే వారికి ఆయన బోధలు దారిదీపాల వంటివి.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1102