tgoop.com/devotional/1113
Last Update:
జ్ఞానసిద్ధి కోసం...
భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం... ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది. భగవత్తత్వ అవగాహనలో మొదటి మెట్టు విగ్రహారాధన. భక్తికి ఒక ఆలంబన అవసరమన్నది మహర్షులు చెప్పిన మాట.
ప్రతిష్ఠించిన విగ్రహం వల్ల భక్తి పుడుతుంది. లక్ష్యం నిలవడానికి, ఏకాగ్రతకు ఓ రూపం అవసరం.
భగవంతుడు పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా అనే అయిదు తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి. ఈ అయిదింటిలో అర్చామూర్తి- విగ్రహ రూపంలో ఉంటాడు.
ఇటువంటి మూర్తిలోనే భక్తుడు తన ఇష్ట దైవాన్ని కొలుచుకుంటాడు. విగ్రహం వలన భక్తులు ఉపాసన చేసుకోవడానికి వీలవుతుంది.
ఉపాసకుడి కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరుడు ఓ రూపం దాల్చాడని పెద్దలు చెబుతారు.
పరబ్రహ్మ తత్వం అర్థమైన వారు నూటికొక్కరు ఉంటారు. అటువంటివారు 'హరిమయము విశ్వమంతయు' అనుకోగలరు. కానీ, సామాన్య భక్తులు ఇంతటి అవగాహనకు రాలేరు. వారికి నిత్యజీవిత కార్యకలాపాల్లో 'దేవుడు' ఒక భాగం. సాధారణ సాధకులు 'మూర్తి'ని దైవంగా భావించి సాధన చేస్తే మనసులోనే మహేశ్వరుడు ఉన్నాడనే దైవత్వ భావన కలుగవచ్చు. మనుషులంతా ఒకే రకమైన స్థాయిలో మానసిక పరిపక్వత ఉన్నవారు కారు. అందువల్ల ఆయా స్థాయి భేదాలు కలిగిన వారికోసం... భక్తి మార్గంలో వారు తరించడం కోసం విగ్రహారాధన తోడ్పడుతుంది. 'ప్రతిమా
స్వల్ప బుద్ధినాం యోగినాం హృదయే హరి:' అన్నారు పెద్దలు. ఇది అత్యంత విశాలమైన ప్రాతిపదిక కలిగిన స్వేచ్ఛాయుతమైన ఉపాసనా మార్గం. సాధకుడికి ప్రాథమిక దశలో విగ్రహారాధన అవసరం. పరిపక్వత సాధించిన వారికి మనసే మందిరమవుతుంది.
ఒక దేవతనే ఆరాధించమని హిందూ ధర్మం చెప్పదు. 'సర్వ దేవత నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి' అని సూక్ష్మంలో మోక్ష సూత్రం చూపారు రుషులు. రత్నం, బంగారం, శిల, మట్టి, కర్ర, స్పటికం, వెండి, రాగి ఇలా ఎనిమిది రకాల వస్తువులు ప్రతిమా రూపకల్పనకు యోగ్యమైనవి. అర్చకుడి నిష్ఠాగరిష్టతలు, శ్రద్ధాభక్తుల వల్ల శిల భగవద్రూపంగా రూపాంతరం చెందుతుంది. మంత్ర శక్తి, భక్తుడి భావనల తీవ్రత వంటివి ప్రతిమలో దైవ చైతన్యాన్ని ప్రోది చేస్తాయి. విగ్రహారాధన వల్ల జ్ఞాన సిద్ధి లభిస్తుంది. విగ్రహం అనే మాటకు విశేషంగా గ్రహించేది అనే అర్థముంది. త్యాగరాజు విగ్రహాలు దొరికినప్పుడు 'కనుగొంటిని రాముని' అన్నారు గానీ... 'కనుగొంటిని రాముని విగ్రహాన్ని' అనకపోవడం జ్ఞానానికి చిహ్నం.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1113